జరిగిన గాయం పెద్దదే... చికిత్స చేద్దాం: ట్రంప్ వీడియో ఇదిగో

  • నిన్న జరిగిన ఘటన దురదృష్టకరం
  • అధికార ప్రక్రియ సామరస్యంగా జరగాలి
  • ట్విట్టర్ లో ట్రంప్ వీడియో
అమెరికా చరిత్రలో నిన్న జరిగిన ఘటనలు అత్యంత దురదృష్టకరమైనవని, ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అమెరికాకు సరిపడబోవని అన్నారు. ఈ మేరకు జాతిని ఉద్దేశించి తాను చేసిన ప్రసంగాన్ని ట్రంప్, ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. యూఎస్ కాపిటల్ భవంతిలోకి ప్రవేశించిన తన మద్దతుదారుల వైఖరిని ఖండించిన ఆయన, చట్టానికి ప్రతి ఒక్కరూ కట్టుబడివుండాల్సిందేనని, నిన్న జరిగిన దురదృష్టకర ఘటన వెనుక ఎవరున్నా మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.

"జనవరి 20న కొత్త పాలన మొదలవుతుంది. ఈ ప్రక్రియ సామరస్యంగా సాగాలన్నదే నా అభిప్రాయం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. "అందరు అమెరికన్లూ హింసకు వ్యతిరేకమే. ఆ భవనాన్ని నిరసనకారుల నుంచి రక్షించేందుకు నేషనల్ గార్డ్స్ ను నేనే పంపించాను. ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారో వారందరూ అమెరికన్లు కానట్టే. చట్టాన్ని వ్యతిరేకించిన వారంతా శిక్షార్హులే. ఇది ప్రజలంతా ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. జరిగిన గాయం పెద్దదే. దానికి చికిత్స చేద్దాం.

నేను ఎన్నికల విషయంలో అన్ని రకాల చట్టపరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తాను. ప్రజల్లో నమ్మకాన్ని పెంచడమే నా విధి. ప్రశాంతంగా అధికార బదిలీ జరగాలి. మన జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయన్న విషయాన్ని ఈ మహమ్మారి సమయంలో సర్వదా గుర్తుంచుకోవాలి. జాతి మొత్తం ఐక్యంగా ఉందని ప్రపంచానికి చెప్పాలి. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ విడుదల చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.


More Telugu News