మా టీకా తీసుకుంటే రెండేళ్ల వరకూ కరోనా నుంచి రక్షణ: మోడెర్నా

  • ఓడో బీహెచ్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • పాల్గొని ప్రసంగించిన స్టీఫానీ బాన్సెల్
  • కొత్త వైరస్ లపైనా వ్యాక్సిన్ పని చేస్తుంది
  • నిరూపించడమే తమ లక్ష్యమన్న మోడెర్నా
తాము తయారు చేసిన కరోనా టీకా తీసుకుంటే, రెండు సంవత్సరాల వరకూ మహమ్మారి సోకకుండా శరీరంలో వ్యాధి నిరోధకత ఉంటుందని మోడెర్నా ప్రకటించింది. ఈ విషయం మరింత డేటా విశ్లేషణ ద్వారా తెలిసిందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. యూఎస్ కు చెందిన మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ కు ఇప్పటికే పలు దేశాలు అనుమతి ఇవ్వగా, ఆయా దేశాల్లో ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కు యూరోపియన్ కమిషన్ బుధవారం నాడు అనుమతించిన నేపథ్యంలో సంస్థ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"టీకా తీసుకుంటే అది ఒకటి లేదా రెండు నెలలు మాత్రమే పని చేస్తుందని, అసలు వ్యాక్సిన్ తీసుకోవడమే వృథా అని ప్రజల్లో భయాందోళనలు, ఆపోహలు నెలకొని ఉన్న వేళ, నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను. అదంతా అవాస్తవం. మా వ్యాక్సిన్ రెండేళ్ల వరకూ పని చేస్తుంది" అని ఆర్థిక సేవల సంస్థ ఓడో బీహెచ్ఎఫ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మోడెర్నా సీఈఓ స్టీఫానీ బాన్సెల్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాక్సిన్ తో శరీరంలో అభివృద్ధి అయ్యే యాంటీబాడీలు చాలా నిదానంగానే మాయమవుతాయని, రెండేళ్ల వరకూ వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని తాము నమ్ముతున్నామని ఆయన స్పష్టం చేశారు. బ్రిటన్, సౌతాఫ్రికాల్లో వెలుగులోకి వచ్చిన కొత్త స్ట్రెయిన్ పై కూడా తమ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తుందని నిరూపించడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు.



More Telugu News