బెంగళూరులో అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్.. నాలుగు బృందాలతో గాలింపు

  • కిడ్నాప్ కోసం కర్నూలు నుంచి 15 మందిని రప్పించిన భార్గవ్‌రామ్
  • భార్గవ్‌కు నేర చరిత్ర ఉందంటూ కోర్టుకు తెలిపిన పోలీసులు
  • కిడ్నాప్ పథకం ఆయనదేనంటున్న వైనం
బోయినపల్లి కిడ్నాప్ కేసులో నిందితుడైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్ బెంగళూరులో ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అతని కోసం నాలుగు బృందాలతో గాలిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీప బంధువులైన ముగ్గురిని కిడ్నాప్ చేయించడం కోసం పథకం రచించిన భార్గవ్‌రామ్.. ఇందుకోసం కర్నూలు జిల్లా నుంచి 15 మందిని రప్పించినట్టు పోలీసులు చెబుతున్నారు.

ఇక కిడ్నాప్‌కు పాల్పడిన దుండగులు టోల్‌ప్లాజాలవైపు వెళ్తే దొరికిపోతామన్న ఉద్దేశంతో అవి లేని సర్వీస్ రోడ్ల మీదుగా బెంగళూరు వైపు పారిపోయారు. వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. కాగా, కిడ్నాప్‌నకు పథకం రచించిన భార్గవ్‌రామ్‌కు నేర చరిత్ర ఉందని, పలు ఆర్థిక నేరాల్లో ఆయన పాత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు.  

మరోవైపు, కిడ్నాప్ కేసు అనుకోని మలుపులు తిరుగుతోంది. మొన్న సాయంత్రం వరకు ఈ కేసులో ఎ2 నిందితురాలిగా ఉన్న అఖిలప్రియను నిన్న ఏ1గా మార్చారు. ఎ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు. సుబ్బారెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదని, పాత కేసు నేపథ్యంలో ఆయనను అనుమానించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అందుకనే నోటీసులు ఇచ్చి పంపించేసినట్టు చెప్పారు.


More Telugu News