నేను అప్పుడే చెప్పాను.. ఇలా చేస్తే నిరసనలు తప్పవని: హర్‌సిమ్రత్ కౌర్ బాదల్

  • 40 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రధాని స్పందించడం లేదు
  • కేంద్రం పట్టనట్టు వ్యవహరించడం సరికాదు
  • అమరీందర్ సింగ్ ఫామ్ హౌస్‌లో కూర్చుని తమాషా చూస్తున్నారు
ఎముకలు కొరికే చలిలో రైతులు తమ నిరసన కొనసాగిస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు చేసేముందు రైతులతో చర్చించకుంటే నిరసనలు, ఆందోళనలు తప్పవని తాను ముందే హెచ్చరించానని అన్నారు. 40 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో ప్రధాని నేరుగా మాట్లాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతుల విశ్వాసం కోల్పోయిందన్నారు.

ఆందోళన చేస్తున్న అన్నదాతలు మరణిస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన కౌర్.. ఈ మరణాలకు బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఏడు విడతలుగా చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయిందని, కాబట్టి మోదీనే నేరుగా రైతులతో మాట్లాడితే ఫలితం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌పైనా కౌర్ విమర్శలు చేశారు. ప్రజలకు సంరక్షకుడిగా ఉండాల్సిన ఆయన బాధ్యతను నిర్వర్తించడంలో విపలమయ్యారని అన్నారు. రైతు సమస్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సగభాగం ఉంటుందని అన్నారు. రైతులు ధర్నాలో ఉంటే అమరీందర్ సింగ్ మాత్రం ఫామ్‌హౌస్‌లో కూర్చుని తమాషా చూస్తున్నారని హర్‌సిమ్రత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News