బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదు: సోయం బాపురావు

  • తోలు తీస్తామని టీఆర్ఎస్ నేతలు అనడం సరికాదు
  • ఇలాగే మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం
  • పార్లమెంటు సమావేశాల్లో నిర్మల్ జిల్లా సమస్యలపై మాట్లాడతా
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే గుడ్డలు ఊడదూసి కొడతామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సోయం బాపురావు తప్పుపట్టారు. బండి సంజయ్ తోలు తీస్తామని టీఆర్ఎస్ నేతలు అనడం సరికాదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఇలాగే మాట్లాడితే తాము కూడా తీవ్రంగా స్పందిస్తామని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని సోయం బాపురావు చెప్పారు. తమ అజెండాలో పేర్కొన్న రామ మందిర నిర్మాణం హామీని నిలబెట్టుకున్నామని... మందిర నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో నిర్మల్ జిల్లా సమస్యలపై మాట్లాడతానని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు చేపట్టాల్సిన రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం బడ్జెట్ ఇవ్వలేదని... అందువల్లే ఆ పనులు ఆగిపోయాయని విమర్శించారు.


More Telugu News