అఖిలప్రియ వ్యవహారంపై చంద్రబాబు, లోకేశ్ నోరు మెదపరెందుకు?: అంబటి రాంబాబు విసుర్లు

  • అచ్చెన్నాయుడు అరెస్టయినప్పుడు ఆయనను పరామర్శించారు
  • అఖిలప్రియ అరెస్ట్ అయితే నోరు మెదపడం లేదు
  • ఇదే అరెస్ట్ ఏపీలో జరిగి ఉంటే రచ్చ చేసేవారు
బోయినపల్లి కిడ్నాప్ కేసులో తెలుగుదేశం నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవినీతి కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ వెళ్లి ఆయనను పరామర్శించారని... ఇప్పుడు కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియను పరామర్శించరా బాబూ? అని అంబటి ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన అఖిలప్రియను పరామర్శించరా? అని అడిగారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై చంద్రబాబు, లోకేశ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు విషయంలో ఒకలా, అఖిలప్రియ విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడి అరెస్ట్ ను రాజకీయ వేధింపులుగా చిత్రీకరించి, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నించారని అంబటి మండిపడ్డారు. ఎన్ని డ్రామాలు చేయాలో అన్నీ చేశారని ఎద్దేవా చేశారు. అఖిలప్రియ విషయంలో ఘీంకారాలు, ట్వీట్లు, లోకేశ్ కూతలు ఏమీ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఇదే కిడ్నాప్ కేసు ఏపీలో జరిగి ఉంటే నానా రచ్చ చేసేవారని వ్యాఖ్యానించారు. తల్లి, తండ్రి లేని పిల్లను వేధిస్తున్నారని, పార్టీ మారినందుకు కక్షకట్టారని అనేవారని అంబటి దుయ్యబట్టారు.


More Telugu News