వ్యాక్సిన్ వేయించుకోవాలా? వద్దా?.. ఊగిసలాటలో 69 శాతం మంది!

  • సర్వే నిర్వహించిన ‘లోకల్ సర్కిల్స్’
  • సర్వేలో పాల్గొన్న 8,723 మంది
  • తొందరపడి వ్యాక్సిన్ వేయించుకోబోమన్న ఆరోగ్య కార్యకర్తలు
వచ్చే వారం నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.  భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, సీరం ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి  ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం రెడీ అవుతోంది. నిజానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కరోనా పీడ విరగడైపోతుందన్న సంతోషం ప్రజల్లో కనిపించాలి. కానీ విచిత్రంగా అందుకు విరుద్ధంగా ఆలోచిస్తుండడం గమనార్హం. ‘లోకల్ సర్కిల్స్’ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం నిర్వహించిన సర్వేలో విచిత్రమైన ఫలితాలు వెల్లడయ్యాయి.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మీరు వేయించుకుంటారా? అన్న ప్రశ్నకు 26 శాతం మంది మాత్రమే వేయించుకుంటామని చెప్పారు. తాము ఆరోగ్య కార్యకర్తలం కాబట్టి ప్రభుత్వమే తమకు టీకా వేస్తుందని 5 శాతం మంది చెప్పారు. మిగతా వారు (69 శాతం మంది) మాత్రం టీకా వేయించుకోవాలా? వద్దా? అన్న సంశయంలో వున్నారు. అక్టోబరు 2020 నుంచి డిసెంబరు నెలాఖరు వరకు మూడు నెలలపాటు సర్వే నిర్వహించిన సంస్థ మొత్తం 8,723 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది.

అక్టోబరు నెలలో 61 శాతం మంది టీకా వేయించుకునే విషయంలో డోలాయమానంలో ఉండగా, నవంబరులో ఆ సంఖ్య 59 శాతానికి తగ్గింది. మరోవైపు, ఆరోగ్య కార్యకర్తల్లోనూ 55 శాతం మంది టీకా విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దుష్ప్రభావానికి సంబంధించిన వార్తలు వెలుగుచూస్తుండడంతో ఆ భయంతోనే వీరు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తొందరపడబోమని ఆరోగ్య కార్యకర్తలు చెప్పడం విశేషం.


More Telugu News