రాముడి విగ్రహంపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగింది: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్

  • రామతీర్థం ఘటనను సీఐడీకి అప్పగించిన ఏపీ సర్కారు
  • ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐడీ చీఫ్
  • పక్కా ప్లాన్ తో ధ్వంసం చేశారని వెల్లడి
  • విలువైన వస్తువుల జోలికి వెళ్లలేదని వివరణ
రామతీర్థం ఘటనపై ఏపీ సర్కారు సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇవాళ విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహం ధ్వంసం అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. రాముడి విగ్రహంపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అభిప్రాయపడ్డారు. సంఘటన స్థలంలో హేక్సా బ్లేడ్ లభ్యమైందని వెల్లడించారు.

ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, సమాజంలో భిన్న వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని సునీల్ కుమార్ తెలిపారు. అక్కడున్న నగలు, ఇతర విలువైన వస్తువులు భద్రంగానే ఉన్నాయని వివరించారు. జరిగిన ఘటన చూస్తుంటే ఆకతాయిల పనిలా అనిపించడంలేదని, పక్కా ప్రణాళికతోనే జరిగినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. దర్యాప్తులో ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది మరింత స్పష్టంగా తేలుతుందని, ఇప్పుడు ఇంతకుమించి చెప్పలేమని అన్నారు.


More Telugu News