కాకుల్లో బర్డ్ ఫ్లూ... చికెన్ దుకాణాల బంద్, కోడిగుడ్ల అమ్మకాలు నిలిపివేత

  • మధ్యప్రదేశ్ లో నేలరాలుతున్న కాకులు
  • 15 రోజులు చికెన్ షాపుల మూసివేత
  • ఇండోర్ లో కంట్రోల్ రూం ఏర్పాటు
  • కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లోనూ అదే పరిస్థితి
  • కేరళలో 12 వేల బాతుల మృతి
దేశంలో కరోనా వైరస్ కు పోటీనా అన్నట్టు బర్డ్ ఫ్లూ క్రమంగా వ్యాపిస్తోంది. మధ్యప్రదేశ్ లో కాకుల పాలిట మృత్యుగీతం ఆలపిస్తున్న ప్రమాదకర ఏవియన్ ఫ్లూ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లోనూ పక్షులు బర్డ్ ఫ్లూ కారణంగా నేలరాలుతున్నాయి.

బర్డ్ ఫ్లూ కారణంగా వందల సంఖ్యలో కాకులు మృతి చెందుతుండడంతో మధ్యప్రదేశ్ అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 100 కాకులు మృత్యువాత పడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో చికెన్ షాపులు మూసివేశారు. 15 రోజుల వరకు తెరవకూడదని అధికారులు ఆదేశించారు. అంతేకాదు, కోడిగుడ్ల అమ్మకాలపైనా నిషేధం విధించారు.

కేరళలోనూ దీని తీవ్రత హెచ్చుస్థాయిలో ఉంది. కొట్టాయం, అళప్పుజ ప్రాంతాల్లో 12 వేల బాతులు బర్డ్ ఫ్లూ కారణంగానే చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. వేల సంఖ్యలో బాతులు మృతి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే బర్డ్ ఫ్లూ పాకిపోతుండడడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అటు, బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇండోర్ నగరంలో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ ఫ్లుయెంజాను గుర్తించినట్టు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ వెల్లడించారు.


More Telugu News