గంగూలీకి గుండెపోటు ఎందుకు వచ్చింది?... ఫార్చూన్ రైస్ బ్రాన్ ఆయిల్ కు ట్రోలింగ్ తిప్పలు

  • ఫార్చూన్ ఆయిల్ కు గంగూలీ ప్రచారం
  • గుండెను పదిలంగా ఉంచుతుందంటూ ప్రకటన
  • ఇప్పుడు గంగూలీకే గుండెపోటు
  • సెటైర్లు గుప్పిస్తున్న నెటిజన్లు
  • పరిశీలిస్తున్నామన్న యాడ్ ఏజెన్సీ
బీసీసీఐ చీఫ్, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురికాగా, ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఫార్చూన్ రైస్ బ్రాన్ ఆయిల్ పై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దాదాకు గుండెపోటు వచ్చింది... మరి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదేనా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 40 ఏళ్ల వయసులోనూ తమ ఆయిల్ హృదయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందని ఫార్చూన్ యాడ్ లో గంగూలీ చెప్పడం చూడొచ్చు. ఆ మాటలు ఇప్పుడాయన పట్ల వికటిస్తున్నాయి.

"ఆ నూనె ఎలాంటిదో ఇప్పటికైనా తెలిసిందా దాదా... నువ్వు త్వరగా కోలుకోవాలి" అంటూ ఓ వ్యక్తి పేర్కొన్నాడు. ఇక, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా వ్యంగ్య ధోరణిలో స్పందించారు. "స్వయంగా ఉపయోగించి చూసిన తర్వాతే ఉత్పత్తులకు ప్రచారం చేయాలి.... జాగ్రత్తగా ఉండాలి.. నీకు దేవుడి ఆశీస్సులు ఉండుగాక!" అంటూ సెటైర్ వేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకత పట్ల ఫార్చూన్ యాడ్ రూపొందించిన ఓగ్లివీ అండ్ మాథర్ సంస్థ ప్రతినిధి  స్పందించారు. ఈ వివాదాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.


More Telugu News