తమిళనాడులో ఎంఐఎం రాకను వ్యతిరేకిస్తున్న ముస్లిం ప్రాబల్య పార్టీలు!

  • ఇతర రాష్ట్రాల్లోనూ ఉనికి చాటుకుంటోన్న ఎంఐఎం
  • త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
  • తమిళనాడుపై కన్నేసిన అసదుద్దీన్ ఒవైసీ
  • బయటి పార్టీ అవసరంలేదన్న తమిళ ముస్లిం పార్టీలు
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ను దాటి ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేస్తోంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికిని చాటేవిధంగా విజయాలు నమోదు చేసింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎంఐఎం ఆ దిశగా అడుగులేస్తోంది. 2016లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసిన మజ్లిస్ ఇప్పుడు ఒవైసీ పార్టీగా అక్కడ ప్రాచుర్యం పొందుతోంది.

దూకుడుగా సాగే ప్రసంగాలు, ప్రత్యర్థి ఎవరైనా ఢీ అంటే ఢీ అనే అభ్యర్థులు, అన్నింటికీ మించి అసదుద్దీన్ ఒవైసీ వ్యూహాలు ఎంఐఎంను ఎక్కడైనా ప్రత్యేకంగా నిలుపుతాయి. ఈ విషయాన్ని తమిళనాడులోని ఇతర ముస్లిం పార్టీలు తేలిగ్గానే గ్రహించాయి. ఎంఐఎం గనుక డీఎంకేతో చేతులు కలిపితే తమకు ఎక్కువ సీట్లు లభించవని ఐయూఎంఎల్, ఎంఎంకే వంటి పార్టీలు భావిస్తున్నాయి. ముస్లిం వాద పార్టీలైన ఐయూఎంఎల్, ఎంఎంకే... తమిళనాడులో డీఎంకే మిత్రపక్షాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

తమ కూటమిలో ఎంఐఎం వస్తే అది తమ స్థానాలకే ఎసరుపెడుతుందన్నది ఐయూఎంఎల్, ఎంఎంకేల భయం. అప్పుడు డీఎంకే... తమకు కేటాయించాల్సిన సీట్లలో కోతపెట్టి ఎంఐఎంకు అప్పగిస్తుందని ఆయా పార్టీల నేతలు సందేహిస్తున్నారు. అందుకే ఎంఐఎం రాకను వారు మనస్ఫూర్తిగా స్వాగతించలేకపోతున్నారు.

దీనిపై ఎంఎంకే నేత ఎంహెచ్ జవహిరుల్లా మాట్లాడుతూ, తమిళనాడు రాజకీయాల్లోకి బయటి నుంచి ఓ పార్టీ రావాల్సినంత అవసరం లేదని తెలిపారు. ఇతర ప్రాంతాల్లోని ముస్లింలతో పోల్చితే తమిళనాడులోని ముస్లింలు సామాజిక ఆర్థిక అభివృద్ధిని ఆస్వాదిస్తున్నారని, అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ వారి ప్రాతినిధ్యం మెరుగ్గానే ఉందని చెప్పారు.


More Telugu News