యావత్ మానవాళికి కరోనా వ్యాక్సిన్ సజావుగా అందేలా చూస్తాం: సంయుక్త ప్రకటన చేసిన భారత్ బయోటెక్, సీరం

  • కొవాగ్జిన్, కొవిషీల్డ్ లకు భారత్ లో అనుమతి
  • ప్రతిజ్ఞా ప్రకటన చేసిన భారత్ బయోటెక్, సీరం
  • అదార్ పూనావాలా, కృష్ణ ఎల్ల పేరిట సంయుక్త ప్రకటన
  • ప్రజల ప్రాణాలు కాపాడడమే తమ లక్ష్యమని వెల్లడి
కొవాగ్జిన్ పేరుతో కరోనా వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్... ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ ను ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ ప్రక్రియల్లో పాలుపంచుకోవాలని నిర్ణయిస్తూ సంయుక్తంగా ఇవాళ ప్రతిజ్ఞా ప్రకటన చేశాయి. భారత్ కు, తక్కిన ప్రపంచానికి సాఫీగా కరోనా వ్యాక్సిన్ అందేలా చూడడమే తమ ముఖ్య ఉద్దేశమని ఆ ప్రతిజ్ఞలో పేర్కొన్నారు.

భారత్ తో పాటు, ఇతర దేశాలకు కూడా అందించేందుకు వీలుగా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి, ఉత్పత్తి, పంపిణీ  చేయాలన్న దిశగా అదార్ పూనావాలా (సీరం), కృష్ణ ఎల్ల (భారత్ బయోటెక్) సంయుక్తంగా నిర్ణయించారని ఆ ప్రతిజ్ఞలో పేర్కొన్నారు. తమ ముందున్న ప్రధాన లక్ష్యం భారత్ తో పాటు ప్రపంచంలోని ప్రజల ప్రాణాలు కాపాడడమేని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా, వారి ఆర్థిక పరిస్థితులను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడంలో వ్యాక్సిన్లు ముఖ్యభూమిక పోషిస్తాయని తెలిపారు.


More Telugu News