100 శాతం సీటింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నిర్మాతల మండలి లేఖ

  • ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం సీటింగ్ నిబంధన
  • 100 శాతం సీటింగ్ కు అనుమతినిచ్చిన తమిళనాడు
  • అదే రీతిలో ఏపీ, తెలంగాణ కూడా స్పందించాలన్న నిర్మాతల మండలి
  • 50 శాతం సీటింగ్ తో థియేటర్లు నష్టపోతున్నట్టు వెల్లడి
సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో 100 శాతం సీటింగ్ నింపుకోవడానికి అనుమతినిస్తూ ఇటీవలే తమిళనాడు సర్కారు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ పరిణామం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలోనూ ఉత్సాహం నింపింది. తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో చిత్ర ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాసింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం సీటింగ్ నిబంధన కారణంగా థియేటర్ల ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నాయని, అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ, సగం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలు నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతోందని వివరించింది. ఖర్చులు కూడా రావడంలేదు సరికదా, థియేటర్ల యాజమాన్యాలు నష్టాల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

కరోనా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతున్న నేపథ్యంలో తమిళనాడు సర్కారు అన్ని నిబంధనలు పాటిస్తూ 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని ఇటీవలే అనుమతి నిచ్చిందని నిర్మాతల మండలి తన లేఖలో ప్రస్తావించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ అంశంపై పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.

దయచేసి 50 శాతం సీటింగ్ నుంచి 100 శాతం సీటింగ్ తో అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా ప్రదర్శనలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయం వల్ల థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలు కోలుకుంటాయని, థియేటర్లు, మల్టీప్లెక్సుల నిర్వహణకు తగిన ఆదాయం పొందుతాయని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తన లేఖలో వివరించింది.


More Telugu News