భారత్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం, శాస్త్రవిజ్ఞాన నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్

  • భారత్ లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ లకు అనుమతి
  • ట్విట్టర్ లో స్పందించిన మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు
  • ఆవిష్కరణల రంగంలో భారత్ అగ్రగామిగా ఉందని కితాబు
  • మీడియాలో వచ్చిన కథనాన్ని పంచుకున్న గేట్స్
ఇప్పటికే వ్యాక్సిన్ తయారీరంగంలో అగ్రగామిగా ఉన్న భారత్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణల రంగంలోనూ, కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంలోనూ భారత్ అగ్రగామిగా నిలుస్తున్న తీరు చాలా గొప్పగా ఉందని అభివర్ణించారు.

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు యావత్ ప్రపంచం చేస్తున్న కృషికి భారత్ నాయకత్వం వహిస్తున్న తీరు అమోఘం అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కొవాగ్జిన్ (భారత్ బయోటెక్-ఐసీఎంఆర్), కొవిషీల్డ్ (ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆఖరి అనుమతులు కూడా ఇచ్చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగం తాలూకు మీడియా కథనాన్ని కూడా బిల్ గేట్స్ తన ట్వీట్ లో పంచుకున్నారు. కరోనాను ఈ ప్రపంచం నుంచి పారద్రోలాలన్న లక్ష్యాన్ని నిజం చేసే క్రమంలో భారత్ ప్రముఖ పాత్ర పోషించనుందని గేట్స్ వివరించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి రంగంలో మిగతా ప్రపంచానికి దారిచూపే స్థానంలో భారత్ ఉందని పేర్కొన్నారు.

భారత్ లో ఉన్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నది సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే కావడం విశేషం.


More Telugu News