ప్రాక్టీసులో గాయపడిన కేఎల్ రాహుల్... ఆస్ట్రేలియా టూర్ నుంచి అవుట్

  • శనివారం నాడు గాయపడిన రాహుల్
  • మణికట్టు బెణికిందన్న బీసీసీఐ
  • కోలుకునేందుకు మూడు వారాలు పడుతుందని వెల్లడి
  • జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతాడని వివరణ
ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ కూడా చేరాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో నెట్ ప్రాక్టీసు చేస్తుండగా రాహుల్ ఎడమ మణికట్టుకు గాయమైంది. దాంతో అతడు టూర్ నుంచి తప్పుకుని అర్థాంతరంగా స్వదేశం రానున్నాడు. శనివారం నాడు గాయం కాగా, వైద్య పరీక్షల నివేదికను అనుసరించి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్ తో టెస్టు సిరీస్ లో మిగిలిన రెండు టెస్టులకు రాహుల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది.

రాహుల్ మణికట్టు బెణికిందని, గాయం తీవ్రత దృష్ట్యా పూర్తిగా కోలుకునేందుకు మూడు వారాల సమయం పడుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఆస్ట్రేలియా నుంచి భారత్ రానున్న రాహుల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉంటూ చికిత్స పొందుతాడని షా ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, కేఎల్ రాహుల్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నది ఇంకా ప్రకటించలేదు.


More Telugu News