దశాబ్దాల తరువాత ఇండియా నుంచి బియ్యాన్ని కొన్న వియత్నాం!

  • బియ్యం ఎగుమతిలో టాప్-3లో ఉన్న వియత్నాం
  • ఈ సంవత్సరం దారుణంగా పడిపోయిన దిగుమతి
  • తొమ్మిది సంవత్సరాల గరిష్ఠానికి బియ్యం ధర
  • 70 వేల టన్నుల బియ్యానికి ఆర్డర్
ప్రపంచంలో బియ్యాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో టాప్-3 స్థానంలో ఉన్న వియత్నాం, ఎన్నో దశాబ్దాల తరువాత, తనకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఇండియా నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసింది. వియత్నాంలో ఈ సంవత్సరం దిగుబడి తగ్గిపోయి, బియ్యం ధర తొమ్మిది సంవత్సరాల గరిష్ఠానికి చేరడంతో, ఇండియా నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిందని రైస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు వెల్లడించారు.

వియత్నాం వంటి దేశం బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నదంటే, ఈ సంవత్సరం ఇండియాలోనూ బియ్యం ధరలు భారీగా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మిగతా బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా తొలి స్థానానికి చేరిందని వెల్లడించారు. వియత్నాం నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల్లో 70 వేల టన్నుల బియ్యానికి ఆర్డర్లు వచ్చాయని, తాము తొలిసారిగా ఆ దేశానికి బియ్యం పంపుతున్నామని కృష్ణారావు తెలిపారు.

ఇండియాలో బియ్యం ధర ఆకర్షణీయంగా ఉందని, బియ్యాన్ని ఎగుమతి చేసే ఇతర దేశాలతో పోలిస్తే, మనమే తక్కువ ధరను ఆఫర్ చేస్తున్నందున ఎగుమతి ఆర్డర్లు వస్తున్నాయని ఆయన అన్నారు. టన్నుకు 310 డాలర్ల వరకూ ఇండియన్ ట్రేడర్ కు లభిస్తోందని, వియత్నాంలో టన్నుకు 500 డాలర్లకు పైగానే ధర ఉందని ఆయన గుర్తు చేశారు. పలు ఆఫ్రికా దేశాల నుంచి కూడా బియ్యానికి డిమాండ్ పెరుగుతోందని ఆయన అన్నారు.

ఇదిలావుండగా, ఇండియా నుంచి తక్కువ ధరకు వచ్చే బియ్యంలో నాణ్యత ఉండటం లేదని వియత్నాం ట్రేడర్లు ఆరోపిస్తుండటం గమనార్హం. ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యాన్ని ప్రజలు నేరుగా తినే పరిస్థితి లేదని, బీరు తయారీకి, జంతువులకు పెట్టేందుకే ఉపయోగపడుతుందని హోచి నిన్ నగరానికి చెందిన వ్యాపారి ఒకరు ఆరోపించారు.


More Telugu News