బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ ను అంగీకరించిన టీమిండియా... టెస్టు సిరీస్ కొనసాగింపుపై తొలగిన అనిశ్చితి

  • ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు
  • సిడ్నీలో కఠినమైన కరోనా నిబంధనలు
  • బయో బబుల్ దాటి వెళ్లబోమన్న టీమిండియా
  • ఐదుగురు ఆటగాళ్లకు ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముంగిట ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఓ రెస్టారెంటులో విందు ఆరగించడం తీవ్ర కలకలం రేపింది. ఆ ఐదుగురు ఆటగాళ్లను టీమిండియా మేనేజ్ మెంట్ ఐసోలేషన్ లో ఉంచింది. అటు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో భారత జట్టు ఆడాల్సిన మిగతా రెండు టెస్టుల వేదికలు సిడ్నీ, బ్రిస్బేన్ లో కరోనా వ్యాప్తి నివారణ చర్యలను మరింత కఠినతరం చేశారు. దాంతో... టీమిండియా ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ ను కొనసాగించే అవకాశాల్లేవని, వారు అర్ధంతరంగా ఇంటి ముఖం పట్టొచ్చని ప్రచారం జరిగింది.

అయితే సిడ్నీలో అమలు చేసే బయో సెక్యూరిటీ ప్రోటోకాల్ ను తాము తప్పకుండా పాటిస్తామని తాజాగా టీమిండియా మేనేజ్ మెంట్ అంగీకరించడంతో ఈ అనిశ్చితికి తెరపడింది. ఇకపై తమ ఆటగాళ్లు బయో బబుల్ ను దాటి బయటికి వెళ్లరని జట్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 7 నుంచి సిడ్నీలో మూడో టెస్టు జరగనుంది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ఈ నెల 15న బ్రిస్బేన్ లో ప్రారంభం కానుంది.

కాగా, ఇటీవల మెల్బోర్న్ లోని ఓ రెస్టారెంటులో విందుకు వెళ్లిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పృథ్వీ షా, శుభ్ మాన్ గిల్, నవదీప్ సైనీలకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. మూడో టెస్టు ప్రారంభానికి ముందు మరోమారు వారికి పరీక్షలు నిర్వహించనున్నారు.


More Telugu News