పోలీసులపై ఉగ్రరూపం ప్రదర్శించిన జేసీ దివాకర్ రెడ్డి... అదేస్థాయిలో బదులిచ్చిన డీఎస్పీ!

  • ఆమరణ దీక్ష అంటూ ప్రకటన చేసిన జేసీ
  • అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు
  • జేసీ బెడ్రూంలోకి వెళ్లిన కానిస్టేబుల్
  • నా రూంలోకి వెళ్లడానికి వాడెవడు అంటూ జేసీ ఫైర్
  • మర్యాదగా మాట్లాడండి అంటూ పోలీసుల రిప్లై
ఫైర్ బ్రాండ్ రాజకీయనేత జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై నమోదు చేసిన అట్రాసిటీ కేసును తొలగించేంత వరకు ఆమరణ దీక్ష చేపడతానని జేసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జూటూరు ఫాంహౌస్ లో ఉన్న జేసీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఓ కానిస్టేబుల్ ఆయన బెడ్రూంలో ప్రవేశించడంతో గొడవ మొదలైంది.

"వాడెవడు... నా రూంలోకి రావడానికి?" అంటూ జేసీ ఓ అభ్యంతరకర పదం ఉపయోగించారు. అక్కడే ఉన్న  డీఎస్పీ శ్రీనివాసులు స్పందిస్తూ, ఆ పదం మాత్రం ఉపయోగించొద్దంటూ స్పష్టం చేశారు. "మళ్లీ అంటాను... వాడెందుకు నా రూంలోకి రావాలి?" అంటూ జేసీ మరోసారి తీవ్ర పదజాలం గుప్పించారు. దాంతో డీఎస్పీ శ్రీనివాసులు కూడా మాటకు మాట బదులిచ్చారు. "ఇంతవరకు మీ మాటలు భరించాం... ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు" అంటూ వార్నింగ్ ఇచ్చారు.

"ఏంచేస్తావ్?" అంటూ జేసీ రెట్టించగా, "మీరేం చేస్తారు?" అంటూ డీఎస్పీ శ్రీనివాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఓ పోలీసు అధికారి జేసీని సముదాయించేందుకు ప్రయత్నించగా, డీఎస్పీ శ్రీనివాసులు ఆ అధికారిని లాగిపారేశారు. "సిగ్గులేదా నీకు, ఆయన అంత నీచంగా మాట్లాడుతుంటే!" అంటూ మండిపడ్డారు.


More Telugu News