మోదీ, షా పట్టింపులకు పోకూడదు.. వారు ఓ మెట్టు దిగితే దేశమంతా అభినందిస్తుంది: సోమిరెడ్డి

  • వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టారు
  • 39 రోజులు దాటింది
  • ఢిల్లీలో ఎముకలు కొరికే చలి, వర్షంలోనూ పోరాడుతున్నారు
  • రైతులు గొంతె‌మ్మ కోరిక‌లు ఏవీ కోర‌డం లేదు
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపట్టి 39 రోజులు దాటిందని, వారు ఢిల్లీలో ఎముకలు కొరికే చలి, జోరు వర్షంలోనూ ప్రాణాలొడ్డి పోరాడుతున్నార‌ని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పట్టింపులకు పోకుండా రైతుల విషయంలో ఓ మెట్టు దిగితే దేశమంతా అభినందిస్తుందని ఆయ‌న సూచించారు.

కేంద్ర ప్ర‌భుత్వాన్ని రైతులు గొంతె‌మ్మ కోరిక‌లు ఏవీ కోర‌డం లేద‌ని చెప్పారు. ఎమ్మెస్పీని చ‌ట్టబ‌ద్ధం చేయ‌డం న్యాయ‌మ‌ని చెప్పారు. మార్కెటింగ్ వ్య‌వ‌స్థ‌ను య‌థాత‌థంగా ఉంచాల‌ని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్కెటింగ్ యార్డుల్లో 60 శాతానికి పైగా స‌రుకుల‌ను రైతులు అమ్ముకుంటున్నార‌ని చెప్పారు. దానికొక వ్య‌వ‌స్థ ఉంద‌ని, అవి లేక‌పోతే క‌ష్ట‌మ‌ని చెప్పారు.

రైతులతో ప్రైవేటు కంపెనీలు అగ్రిమెంటు చేసుకుంటే ఎమ్మెస్పీకి త‌క్కువ ధ‌ర‌కు కాకుండా ఆ ఒప్పందం చేసుకోవాల‌ని చెప్పారు. ఇవ‌న్నీ న్యాయ‌మైన కోరిక‌ల‌ని తెలిపారు. కొత్త చ‌ట్టాల ద్వారా పెద్ద కంపెనీలు ల‌క్ష‌ల ట‌న్నుల వ్య‌వ‌సాయ దిగుబ‌డుల‌ను నిల్వ చేసుకుని, మార్కెట్లో ప్ర‌జ‌ల‌కు కొర‌త సృష్టించి అప్పుడు అత్య‌ధిక ధ‌ర‌ల‌కు అమ్ముకునే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. 


More Telugu News