హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చుతారా?: సీపీఐ నారాయ‌ణ‌పై విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఫైర్

  • హిందువులను అవమానించే నారాయణ క్షమాపణ చెప్పాలి
  • కమ్యూనిస్టు పార్టీలకు వయస్సు అయిపోయింది
  • సీపీఐ పార్టీ నేత నారాయణ గారికీ వయసైపోయింది
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార, ప్రతిపక్ష నాయకులకు రాతి విగ్రహాలపై ఉన్న ప్రేమ ఢిల్లీ రైతులపై లేకపోవడం దారుణమని సీపీఐ నేత నారాయణ విమ‌ర్శ‌లు గుప్పించారు.  దేవుళ్ల పేరు చెప్పి మీసాలు తిప్పుకోవడం మానేసి రైతుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. రామ‌తీర్థంతో పాటు ప‌లు చోట్ల దేవుళ్ల‌ విగ్ర‌హాలు ధ్వంస‌మైన నేప‌థ్యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌కు సంబంధించి వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్టు చేశారు.

'హిందూ దేవుళ్లను రాతి విగ్రహాలతో పోల్చి హిందువులను ఆవమానించే టటువంటి సీపీఐ నేత నారాయణ హిందువులకు క్షమాపణ చెప్పాలి. కమ్యూనిస్టు పార్టీలకు వయసు అయిపోయింది. సీపీఐ పార్టీ నేత నారాయణ గారికి వయసైపోయింది' అని విమ‌ర్శించారు.

'అందుకే ఇలాంటి  వివాదాస్పద మాటలతో మీడియా ప్రచారంతో కాలం వెళ్ల‌బుచ్చుతున్నారు. కమ్యూనిస్టుల మాటలకు, చేతలకు ఏనాడు పొంతన ఉండదు. నిన్ననే దేవాలయాల గురించి దొంగ ఏడుపులతో ప్రకటనలు ఇచ్చారు. గాంధేయవాదం గురించి మాట్లాడతారు, గాంధీ జయంతి రోజు హింసా మార్గాన్ని ఎంచుకొని చికెన్ తింటారు' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు.

'నారాయణ గారు కుటుంబ సమేతంగా తిరుమలకి వెళ్ళారు. మరి తిరుమలలో  మీరు మీ కుటుంబం రాతిని చూశారా ? లేదా వెంకటేశ్వరుడిని దేవుడిగా చూశారా? అసలు తిరుమలలో ఏముందని మీరు మీ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు నారాయణ గారు?  కమ్యూనిస్టులు ఒకవైపు దేవుళ్ల‌ను అవమానిస్తారు. వీరికి ఇది అలవాటుగా మారింది. అసలు మీ పేరులోనే ఉంది నారాయణ తెలుసుకో. ఒకరేమో సీతారాం ఏచూరి (రాముడు), ఒకరేమో రామకృష్ణ ( రాముడు కృష్ణుడు)' అని అన్నారు.  

'రైతులు, వాళ్ళ జీవితాలను మార్చే ఉపయోగమైన బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి, వారి ఉద్యమంతో చలికాచుకునే  కమ్యూనిస్టులు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం' అని విమ‌ర్శ‌లు గుప్పించారు.


More Telugu News