సీఎం కావాల‌నుకుంటున్న స్టాలిన్ ఆశ నెరవేరదు: అన్న అళ‌గిరి వ్యాఖ్య‌లు

  • కొత్త పార్టీ పెట్ట‌నున్న‌ట్లు సంకేతాలు
  • రాజకీయంగా అణ‌చివేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి
  • స్టాలిన్ కు గ‌తంలో కోశాధికారి పదవి ఇప్పించా
  • న‌న్ను డీఎంకే నుంచి బయటకు పంపించారు
కొన్ని నెల‌ల్లో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. మాజీ ముఖ్యమంత్రి దివంగ‌త‌ క‌రుణానిధి కుమారుడు అళ‌గిరి త్వ‌ర‌లో కలైంజర్‌ డీఎంకే పేరిట పార్టీ పెడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మధురైలో మద్దతుదారులతో భేటీ అయ్యారు.  

ఈ నేప‌థ్యంలో త‌న త‌మ్ముడు స్టాలిన్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌తంలో డీఎంకే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని, అలాగే త‌న‌ను రాజకీయంగా అణ‌చివేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగినా తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. త‌న‌కు గ‌తంలో దక్షిణ తమిళనాడు పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవిని అప్పగించారని, ఆ ప్రాంతం మీద పట్టు సాధించి పార్టీకి విజ‌యాలు అందించాన‌ని చెప్పారు.

గ‌తంలో కరుణానిధితో మాట్లాడి స్టాలిన్‌కు కోశాధికారి పదవి ఇప్పించాన‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని స్టాలిన్ గుర్తు చేసుకోవాల‌ని అన్నారు. తన ఇంటికి స్టాలిన్ కుటుంబంతో సహా వచ్చిన సమయంలో 'కలైంజర్ (క‌రుణానిధి) తర్వాత పార్టీకి అన్నీ నువ్వే'నని తాను ప్రోత్స‌హించాన‌ని తెలిపారు. తాను పదవుల కోసం ఎన్నడూ ఆశ‌ప‌డ‌లేద‌ని చెప్పారు.

స్టాలిన్‌కు గ‌తంలో డిప్యూటీ సీఎం పదవి రావడంలో త‌న పాత్ర ఉంద‌న్నారు. అయితే,  పార్టీ కోసం ఓ కార్యకర్తగా ఇంత‌గా శ్రమించిన తాను ఏదో తప్పు చేసినట్టుగా చూశార‌ని చెప్పారు. అంతేగాక‌, త‌న‌ను డీఎంకే నుంచి బయటకు పంపించారని చెప్పారు.

త‌మిళ‌నాడుకు ముఖ్య‌మంత్రి కావాలన్న ఆశతో స్టాలిన్‌ ఉన్నాడని ఆయ‌న అన్నారు. అయితే, ఆ పదవిలోకి ఆయన వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. తాను ఏడేళ్లులుగా  మౌనంగా ఉన్నానని, ఇప్పుడు తాను ఏ నిర్ణయం తీసుకున్నా త‌న‌ మద్దతుదారులు త‌న వెంటే ఉంటార‌ని చెప్పారు.


More Telugu News