న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో స్వల్ప అగ్నిప్రమాదం!
- షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
- ప్రమాదం జరిగిన గదిలో ఆస్తినష్టం
- మంటలను ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో గోదావరి బ్లాక్ లోని 908వ నంబర్ గదిలో మంటలు చెలరేగాయి. గదుల్లో గెస్ట్ లు ఎవరూ లేక, అన్నీ ఖాళీగానే ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో మంచాలు, పరుపులు, టేబుళ్లు, సోఫా, కుర్చీలు తదితరాలు కాలిపోయాయి.