శ్రీకాకుళం జిల్లాలో బుద్ధుడి విగ్రహం ధ్వంసం.. నెల రోజుల వ్యవధిలో రెండోసారి!

  • ఏపీలో కొనసాగుతున్న విగ్రహాలపై దాడులు
  • టెక్కలిలో బుద్ధుడి విగ్రహం చేయి విరగ్గొట్టిన దుండగులు
  • పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న డీఈ
విగ్రహాలపై దాడులకు వ్యతిరేకంగా ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చ జరుగుతుండగానే శ్రీకాకుళంలో అటువంటిదే మరో ఘటన జరిగింది. ఈసారి ఆలయంలో దేవుళ్ల విగ్రహాలకు బదులు దుండగులు బుద్ధుడి విగ్రహాన్ని ఎంచుకున్నారు. జిల్లాలోని టెక్కలిలో బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఈ విగ్రహంపై దాడులు జరగడం గమనార్హం. నెల రోజుల క్రితం ఈ విగ్రహం చేతిని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో అధికారులు కొత్త చేతిని అమర్చారు. ఆదివారం మరోమారు అదే చేతిని దుండగులు మళ్లీ విరగ్గొట్టారు.  ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత తాగునీటి పథకం పక్కనున్న ఉద్యాన వనంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహంతోపాటు బుద్ధుడి విగ్రహాన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు.

ఇప్పటికే విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్న వేళ బుద్ధుడి విగ్రహంపై దాడితో మరోమారు కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ రాజు తెలిపారు.


More Telugu News