చరణ్ కి కథ చెప్పిన తమిళ దర్శకుడు!

  • 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' సినిమాలలో చరణ్ 
  • 'జెర్సీ' దర్శకుడితో సినిమా అంటూ వార్తలు
  • చరణ్ కి కథ చెప్పానన్న లోకేశ్ కనగరాజ్
  • త్వరలో పూర్తి కథ చెబుతానని వెల్లడి    
మెగా హీరో రామ్ చరణ్ నటించే తదుపరి సినిమా ఏమిటన్నది ఇంతవరకు అధికారికంగా వెల్లడి కాలేదు. గత కొంతకాలంగా చరణ్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం త్వరలో పూర్తవుతుంది. ఆ వెంటనే 'ఆచార్య' సినిమా షూటింగులో చరణ్ జాయిన్ అవుతాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, ఆ తర్వాత చేయబోయే సినిమా ఏమిటన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

లాక్ డౌన్ సమయం నుంచీ చరణ్ పలువురు దర్శకులు చెబుతున్న కథలు వింటున్నాడని వార్తలొచ్చాయి. 'జెర్సీ' చిత్రంతో సక్సెస్ కొట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా ఓ కథ చెప్పాడనీ, అది చరణ్ కి నచ్చిందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై మళ్లీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరు కూడా వినిపిస్తోంది.

ఇటీవల చరణ్ ని కలసి ఆయన ఓ కథ చెప్పాడని వార్తలొచ్చాయి. దీనిని తాజాగా లోకేశ్ కూడా ధ్రువీకరించాడు. 'చరణ్ ని కలసి ఓ లైన్ చెప్పాను. త్వరలోనే పూర్తి కథ చెబుతాను' అంటూ లోకేశ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనిని బట్టి ఈ దర్శకుడితో చరణ్ సినిమా సెట్ అవ్వచ్చని అంటున్నారు. తాజాగా విజయ్ తో లోకేశ్ చేసిన 'మాస్టర్' సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. మరోపక్క, ప్రస్తుతం కమలహాసన్ తో లోకేశ్ 'విక్రమ్' అనే సినిమా చేస్తున్నాడు.


More Telugu News