గంగూలీకి మరోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించే అవకాశం

  • నిన్న ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిన గంగూలీ
  • యాంజియోప్లాస్టీ నిర్వహించిన డాక్టర్లు
  • కోలుకుంటున్న దాదా
  • సాధారణ స్థితిలో బీపీ, షుగర్, ఈసీజీ
  • మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న వైద్యులు
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిన్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు కోల్ కతాలోని ఓ ఆసుపత్రిలో వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. బీపీ, షుగర్, హృదయస్పందన, శరీర ఉష్ణోగ్రత అన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని వివరించారు.

కాగా, నిన్న ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన దాదాకు అత్యవసర వైద్యపరీక్షలు నిర్వహించారు. కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఉన్నట్టు గుర్తించారు. వాటిని తొలగించేందుకు స్టెంట్ అమర్చారు. దీనిపై వైద్యులు బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం గంగూలీ సాధారణ స్థితిలోనే ఉన్నారని, ఆయన నిద్రపోతున్నారని వెల్లడించారు. అయితే, మరోసారి యాంజియోప్లాస్టీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని, గంగూలీ పరిస్థితిని మరోసారి అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని వైద్యులు పేర్కొన్నారు. దాదా రక్తపోటు 110-70గా ఉందని, ఆక్సిజన్ స్థాయి 98 శాతంగా నమోదైందని వివరించారు.

గంగూలీ చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రి ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, దాదా అల్పాహారం తీసుకున్నారని, వార్తాపత్రికలు చదివాడని, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడాడని వెల్లడించారు. గంగూలీకి చికిత్స అందించిన వైద్యుల్లో ఒకరు స్పందిస్తూ, ఈసీజీ సాధారణ స్థితిలో ఉండడంతో ఆక్సిజన్ సపోర్టు తొలగించామని తెలిపారు.


More Telugu News