రామతీర్థంలో చంద్రబాబు ప్రమేయం ఉంటే రాముడే ఆయన్ను శిక్షిస్తాడు: వెల్లంపల్లి

  • రామతీర్థంలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి
  • చంద్రబాబు నీతికబుర్లు చెబుతున్నారని వ్యాఖ్యలు
  • దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శలు
  • చంద్రబాబుకు ఇవాళ జై శ్రీరామ్ గుర్తొచ్చిందంటూ వ్యంగ్యం
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో రామస్వామి ఆలయాన్ని మంత్రివర్గ సహచరుడు బొత్స సత్యనారాయణతో కలిసిన సందర్శించిన అనంతరం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు.

దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఇప్పుడు హిందూ సంప్రదాయాలు, ఆలయాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు ఎన్నో ఆలయాలను దుర్మార్గంగా కూల్చివేశారని ఆరోపించారు.

"నిన్న చంద్రబాబు రామతీర్థం వచ్చి చాలా నీతి కబుర్లు చెప్పారు. ఆయన మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. చంద్రబాబుకు ఇవాళే జ్ఞానోపదేశం అయింది, ఇవాళ జై శ్రీరామ్ అనేది గుర్తుకొచ్చింది" అని ఎద్దేవా చేశారు.

రామతీర్థం ఘటనలో చంద్రబాబు పాత్ర ఉంటే ఆ రాముడే ఆయనను శిక్షిస్తాడని తెలిపారు. స్థానిక సంస్థలు ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక కోసం ఆలయాల అంశాన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నాడని, దేవాలయాలతో రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.


More Telugu News