పోలీసుల దిగ్బంధంలో రామతీర్థం!

  • రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన రామతీర్థం 
  • నేడు సందర్శించనున్న బొత్స, వెల్లంపల్లి
  • అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని నిఘా వర్గాల సమాచారం
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన రామతీర్థం ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడి దేవాలయంలో విగ్రహం ధ్వంసం కావడం, రాజకీయ రంగు పులుముకుని, ప్రధాన పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటల సమయంలో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి తదితరులు సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక్కడి రామస్వామి ఆలయంలో శ్రీరాముని విగ్రహం తలను ఖండించిన దుండగులు, దాన్ని కోనేరులో పడవేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ, బీజేపీ విరుచుకుపడుతుండగా, వైసీపీ నేతలు మాత్రం తెలుగుదేశం వారే ఈ పని చేయించారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు ఆలయాన్ని సందర్శించాలని నిర్ణయించుకోగా, వారిని అడ్డుకునేందుకు టీడీపీ స్థానిక నేతలు ప్రయత్నించవచ్చని నిఘా వర్గాలు తెలపడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.


More Telugu News