ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీ అరెస్ట్.. లాహోర్‌లో బేడీలు!

  • 2008లో లఖ్వీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస
  • 2015 నుంచి బెయిలుపై ఉన్న లష్కరే కమాండర్
  • లాహోర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఉగ్రవాదులకు కళ్లెం వేయాలంటూ పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో  స్పందించిన ఇమ్రాన్ ప్రభుత్వం లష్కరే తోయిబా కమాండర్, ముంబై పేలుళ్ల సూత్రధారి జకీవుర్ రెహ్మన్ లఖ్వీకి బేడీలు వేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న 61 ఏళ్ల లఖ్వీని నిన్న పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిఘా ఆపరేషన్ అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఐక్యరాజ్య సమితి లఖ్వీని 2008లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ముంబై పేలుళ్ల కేసులో అరెస్ట్ అయిన అతడు 2015 నుంచి బెయిలుపై ఉన్నాడు. తాజాగా, అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లాహోర్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. ఉగ్రవాదుల కోసం సేకరించిన నిధులతో ఓ చికిత్సా కేంద్రాన్ని నిర్వహిస్తున్న లఖ్వీ, దాని ద్వారా సమీకరించిన నిధులను తిరిగి ఉగ్రవాదులకు చేరవేసేవాడని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం (సీటీడీ) తెలిపింది.


More Telugu News