రేపు రామతీర్థం వెళ్లాలని ఏపీ మంత్రుల నిర్ణయం

  • ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన రామతీర్థం
  • ఇవాళ రామతీర్థంలో వాడీవేడి వాతావరణం
  • మంత్రులపై విపక్షాల విమర్శలు
  • రేపు ఉదయం 10 గంటల తర్వాత బొత్స, వెల్లంపల్లి పయనం
  • సంఘటన స్థలం పరిశీలించనున్న మంత్రులు
నిత్యం రామనామ స్మరణతో మార్మోగే రామతీర్థం పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఇవాళ రాజకీయ పార్టీల నినాదాలు వినిపించాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్న రామస్వామి ఆలయం కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల ఇక్కడి రాముల వారి విగ్రహం తలను ఖండించిన దుండగులు కోనేరులో పడేయడంతో మొదలైన జ్వాలలు పార్టీలకు అతీతంగా రాజుకున్నాయి. విపక్షాలన్నీ ఏపీ సర్కారుపై ధ్వజమెత్తుతున్నాయి. మంత్రులపైనా విమర్శలు చేశాయి. ఈ క్రమంలో రేపు రామతీర్థం వెళ్లాలని వైసీపీ మంత్రులు నిర్ణయించుకున్నారు.

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  ఆదివారం ఉదయం రామతీర్థంలో బోడికొండపై ఉన్న రామస్వామి ఆలయానికి వెళ్లి అక్కడి ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రే మంత్రి వెల్లంపల్లి విశాఖ బయల్దేరారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత ఆయన రామతీర్థం వెళతారు. బొత్స కూడా అదే సమయంలో విజయనగరం నుంచి రామతీర్థంకి వెళతారు.


More Telugu News