కరోనా వ్యాక్సిన్ పై సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ విచిత్ర వ్యాఖ్యలు!

  • త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ
  • అది బీజేపీ వ్యాక్సిన్ అంటూ అఖిలేశ్ వ్యాఖ్యలు
  • తాను తీసుకోనని స్పష్టీకరణ
  • బలమైన కారణం ఉంటుందన్న ఎమ్మెల్సీ అశుతోష్
  • తాము మరో వ్యాక్సిన్ తెస్తామని వెల్లడి
దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అది బీజేపీ వ్యాక్సిన్ అని, దాన్ని నమ్మలేమని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించగా, ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా మరో అడుగు ముందుకేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే నపుంసకత్వం వస్తుందని అన్నారు. కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపీనే అధికారంలో ఉందని, అందుకే వారు తీసుకొచ్చిన వ్యాక్సిన్ ను తాము వేయించుకోమని సిన్హా స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో వ్యాక్సిన్ రూపొందిస్తామని చెప్పారు.

తమ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఆ వ్యాక్సిన్ తీసుకోవడం లేదంటే దాని వెనుక బలమైన కారణమే ఉంటుందని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ చెప్పింది కేవలం సమాజ్ వాదీ పార్టీ నేతలకు మాత్రమే కాదని, రాష్ట్రంలో ప్రజలందరికీ ఆయన వ్యాఖ్యలు వర్తిస్తాయని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తో ప్రజలకు హాని కలగవచ్చు అని, బహుశా కరోనా వ్యాక్సిన్ నపుంసకత్వాన్ని కలుగజేస్తుందంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు  చేశారు.


More Telugu News