వైసీపీ నేతలను పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లారు... చంద్రబాబు వస్తుంటే లారీలు అడ్డుపెట్టడం వింతగా ఉంది: సోమిరెడ్డి

  • రామతీర్థం ఘటన నేపథ్యంలో సోమిరెడ్డి స్పందన
  • పోలీసుల వైఖరిని తప్పుబట్టిన టీడీపీ సీనియర్ నేత
  • వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు పెరిగాయని వెల్లడి
  • ఇప్పటివరకు దోషులను పట్టుకోలేకపోయారని విమర్శలు
రామతీర్థం వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగాయంటూ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. రాములవారి విగ్రహ ధ్వంసానికి కారకులైన వైసీపీ నేతలు రామతీర్థానికి రావడం పట్ల భక్తులు అభ్యంతరం చెప్పినా పోలీసులు ఆ నేతలను దగ్గరుండి గుడికి తీసుకెళ్లారని సోమిరెడ్డి ఆరోపించారు. కానీ, అదే పోలీసులు సీనియర్ నాయకుడు, విపక్ష నేత చంద్రబాబు వస్తుంటే లారీలు అడ్డుపెట్టడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు.

ఒకటి కాదు, రెండు కాదు... వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఆలయాలపై దాడులు జరిగినా, ఇప్పటివరకు దోషులను పట్టుకుని శిక్షించకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం తలదించుకుని క్షమాపణ చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవడానికి బదులు నిరసనలు తెలిపేవారిపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యల పర్యవసానంగా, నేరం ఒప్పుకోమని టీడీపీ కార్యకర్తలను రాత్రంతా స్టేషన్ లో ఉంచి హింసించడం కిరాతకం అని పేర్కొన్నారు.

అసలు ఈ రాష్ట్రం ఎక్కడికి వెళుతోందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. ఆలయాలు, రథాలు, విగ్రహాల ధ్వంసాలను హిందువులే కాదు, ఏ మతం వారు కూడా సమర్థించడంలేదని స్పష్టం చేశారు. తీరు మార్చుకోకపోతే వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని సోమిరెడ్డి హెచ్చరించారు.


More Telugu News