పాకిస్థాన్ లో ఆలయాన్ని కూల్చితే వెంటనే చర్యలు తీసుకున్నారు... జగన్ ప్రభుత్వం ఆ మాత్రం చర్యలు తీసుకోలేదా?: పవన్

  • ఏపీలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం
  • తాజాగా మర్లబండలో సీతారాముల విగ్రహాలు ధ్వంసం
  • తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్
  • హిందువులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని వ్యాఖ్యలు
ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసం ఘటనలతో వైసీపీ సర్కారు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుండగా, విపక్షాలు విమర్శల జడివాన కురిపిస్తున్నాయి. ఈ అంశంలో జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. పొరుగుదేశాన్ని చూసైనా జగన్ రెడ్డి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పాకిస్థాన్ లో ఓ హిందూ దేవాలయాన్ని అల్లరిమూకలు ధ్వంసం చేస్తే, అక్కడి ప్రభుత్వం వెంటనే స్పందించిందని పవన్ వెల్లడించారు. 45 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా, దేవాలయాన్ని పునర్నిర్మించే బాధ్యతను కూడా తీసుకుందని వివరించారు. శత్రుదేశం పాటి చర్యలను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోలేదా? అని జనసేనాని ప్రశ్నించారు.

ధర్మానికి నిండైన రూపంగా దర్శనమిచ్చే శ్రీరామచంద్రుని విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా రాష్ట్రంలో హిందువుల నమ్మకాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాజాగా కర్నూలు జిల్లా మర్లబండలో ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారామచంద్రుల విగ్రహాలను పగులగొట్టడం దుర్మార్గమైన చర్య అని పవన్ విమర్శించారు.

శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటనల నుంచి తాజాగా రామతీర్థం, రాజమండ్రి, మర్లబండ వరకు విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, రథాలు తగులబెడుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే  హిందూ దేవాలయాలకు, విగ్రహాలకు అపవిత్రత జరుగుతోందని, మతోన్మాదులు మరింతగా తెగబడుతున్నారని మండిపడ్డారు. జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.


More Telugu News