జనవరి 4న రామతీర్థంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం: సోము వీర్రాజు

  • రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి
  • ఇన్ని దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు
  • ఆలయాలపై దాడులకు నిరసనగా ఉద్యమం చేపడతాం
రామతీర్థంలో రాముడి విగ్రహం తలను దుండగులు తొలగించిన ఘటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈరోజు రామతీర్థం వద్ద టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం కొండపైకి వెళ్తున్నారు.

మరోవైపు, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు అందరం కలసి ఈనెల 4న రామతీర్థం వెళ్తామని చెప్పారు. రామతీర్థంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఒక్క రామతీర్థంలో మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతున్నామని అన్నారు.

దేవాలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని... దీని గురించి తాము మాట్లాడితే రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం సక్రమంగా స్పందిస్తే తాము మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. అభ్యర్థి ఎవరనే విషయంలో తొందర లేదని అన్నారు. అభ్యర్థిపై ఇరు పార్టీలకు స్పష్టత ఉందని అన్నారు.


More Telugu News