జగన్ గురించి గూగుల్ చేస్తే మాకు మరోలా కనిపిస్తోంది: విశ్రాంత జస్టిస్ రాకేశ్ కుమార్ కు కొడాలి నాని కౌంటర్

  • జగన్ గురించి గూగుల్ చేశానన్న మాజీ జస్టిస్
  • కేసుల వివరాలన్నీ కనిపించాయని వెల్లడి
  • ఏది సెర్చ్ చేస్తే అదే కనిపిస్తుందన్న కొడాలి నాని
  • తమకు జగన్ మంచితనం కనిపించిందని వెల్లడి
  • జగన్ పాలనకు కొందరు అడ్డుపడుతుంటారని వ్యాఖ్యలు
వైఎస్ జగన్ గురించి గూగుల్ చేస్తే ఆయనపై ఉన్న కేసుల వివరాలు చూసి ఆశ్చర్యపోయానని ఇటీవల మాజీ జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పదవీ విరమణకు ముందు ఆయన హైకోర్టులో ఓ విచారణ సందర్భంగా మాట్లాడుతూ, జగన్ పై ఇన్ని కేసులు ఉన్నాయన్న సంగతి తనకు తెలియదని, గూగుల్ ద్వారానే ఆయనపై ఉన్న కేసుల సమాచారం తెలుసుకున్నానని రాకేశ్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా, రాకేశ్ కుమార్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

"గూగుల్ లో జగన్ గురించి సెర్చ్ చేస్తే ఏదో వస్తోందని రిటైర్డ్ జడ్జి అంటున్నాడు. కానీ మేం గూగుల్ సెర్చ్ చేస్తే జగన్ కుటుంబం గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వస్తోంది. ముఖ్యంగా... ప్రత్యర్థులు ఎంతటి గట్టివాళ్లయినా జగన్ వెనుకంజ వేయకుండా ఢీకొడతాడని గూగుల్ లో చూపిస్తోంది. దేశ చరిత్రలో మరే సీఎం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వ్యక్తిగా మాకు గూగుల్ లో కనిపించింది. ఎవరికీ లొంగే రకం కాదని, 40 ఏళ్ల చరిత్రగల పార్టీలతో ఢీకొట్టిన వ్యక్తిగా మాకు సమాచారం దర్శనమిస్తోంది.

అయినా గూగుల్ లో ఏది చూడాలనుకుంటే దానికి సంబంధించిన సమాచారమే వస్తుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురించి నొక్కినా అదే వస్తుంది" అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సీఎం జగన్ ఏ మంచి పనిచేసినా అడ్డుపడే వాళ్లున్నారని, ఎంతమంది అడ్డుపడ్డా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడంటూ జగన్ ను కొనియాడారు. రాష్ట్రంలో చాలామంది వస్తుంటారు, పోతుంటారని, వాళ్ల గురించి పట్టించుకోనవసరం లేదని కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జొన్నవాడలో అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News