ఇండియా గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా: షోయబ్ అఖ్తర్

  • రెండో టెస్టులో భారత జట్టు చూపించిన పట్టుదల అమోఘం
  • రహానే నాయకత్వంలో ఆటగాళ్లంతా ప్రతిభను చాటారు
  • వచ్చిన అవకాశాన్ని ఆటగాళ్లు సద్వినియోగం చేసుకున్నారు
మెల్బోర్న్ లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియాను టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో టీమిండియాపై, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ రహానేపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ కూడా టీమిండియాపై ప్రశంసలు గుప్పించాడు. భారత జట్టు చూపించిన పట్టుదల అమోఘమైనదని ప్రశంసించాడు.

రహానే చాలా సైలెంట్ గా కనిపిస్తాడని... హడావుడి చేయడం, అతిగా ప్రవర్తించడం వంటివి ఉండవని అన్నాడు. కానీ, అతని నాయకత్వంలో ఆటగాళ్లంతా తన ప్రతిభను చాటారని చెప్పారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటారని అన్నాడు. స్టార్ ప్లేయర్లు లేకపోయినా ఇండియా ఘన విజయం సాధించిందని కితాబిచ్చాడు.

ఆస్ట్రేలియాను వాళ్ల దేశంలోనే ఒక ఉపఖండపు జట్టు ఓడిస్తుందని 10, 15 ఏళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరని అఖ్తర్ చెప్పాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నాడు. సిరీస్ మరింత రసవత్తరంగా కొనసాగాలని... టీమిండియా ఈ సిరీస్ గెలవాలని ఆకాంక్షించాడు. ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని అన్నాడు.


More Telugu News