పవన్ కల్యాణ్, లోకేశ్ లపై ఏపీ మంత్రి కన్నబాబు సెటైర్లు

  • టీడీపీ హయాంలో రైతు సమస్యలు గుర్తుకు రాలేదా?
  • నష్టపోయిన ప్రతి రైతును మేము ఆదుకుంటున్నాం
  • లోకేశ్ లా తాను అమ్మాయిలతో చిందులు వేయలేదన్న మంత్రి 
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్ లపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఏనాడూ పరామర్శించని వారు ఇప్పుడు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ఇన్ పుట్ సబ్సిడీని ఎగ్గొడితే పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరికి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. రైతులకు గత ప్రభుత్వం కంటే ఎక్కువ సాయాన్ని తమ ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును తాము ఆదుకుంటున్నామని చెప్పారు.

ఇటీవల కన్నబాబు పాల్గొన్న ఓ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై కన్నబాబు మాట్లాడుతూ, తాను సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నప్పుడు స్టేజ్ దగ్గర భక్తి పాటలు వచ్చాయని... అందుకే తాను అక్కడకు వచ్చానని అన్నారు. లోకేశ్ లా తాను అమ్మాయిలతో చిందులు వేయలేదని, వాళ్ల మామ మాదిరి రికార్డింగ్ డ్యాన్సులు చేయలేదని చెప్పారు.


More Telugu News