అంచనాలకు మించి దేశ ఆర్థిక లోటు.. 135% నమోదు!

  • రూ.10.75 లక్షల కోట్ల మేర లోటు
  • వచ్చిన ఆదాయం రూ.8.3 లక్షల కోట్లే
  • ఖర్చు పెట్టింది రూ.19.6 లక్షల కోట్లు
  • కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నివేదికలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన
  • కరోనా లాక్ డౌన్లు దెబ్బకొట్టాయని వెల్లడి
దేశ ఆర్థిక లోటు భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–2020) 2020లో నమోదైన 114.8 శాతం లోటుతో పోలిస్తే 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మరింత ఎక్కువైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి ఆర్థిక లోటు 135.1 శాతంగా నమోదైందని బడ్జెట్ అంచనాల్లో కేంద్రం పేర్కొంది. దాని విలువ 10 లక్షల 75 వేల 507 కోట్లు అని పేర్కొంది.

గురువారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన తాజా నివేదికలో కేంద్రం ఈ విషయాలను వెల్లడించింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆర్థిక లోటును 7.96 లక్షల కోట్లు (జీడీపీలో 3.5%)గా పేర్కొన్నారు. కానీ, అంచనాలకు మించి అది నమోదైంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయని, దాని వల్లే ఆర్థిక లోటు భారీగా పెరిగిందని వివరించింది. విధిలేని పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ల వల్ల అన్ని వ్యాపారాలు ఆర్థికంగా చితికిపోయాయని, దీంతో ప్రభుత్వానికి ఆదాయమూ బాగా తగ్గిపోయిందని పేర్కొంది.

నవంబర్ చివరి నాటికి ప్రభుత్వానికి రూ.8 లక్షల 30 వేల 851 కోట్ల మేర ఆదాయం వచ్చిందని, బడ్జెట్ అంచనాల్లో అది 37 శాతం అని కేంద్రం పేర్కొంది. అందులో రూ.6 లక్షల 88 వేల 430 కోట్లు పన్నుల రూపంలోనే ఆదాయం వచ్చిందని చెప్పింది. పన్నేతర ఆదాయం రూ.లక్షా 24 వేల 280 కోట్లు, రుణేతర మూలధన ఆదాయం రూ.18,141 కోట్లు అని వెల్లడించింది. రుణ రికవరీలు, పెట్టుబడి విరమణల ఆదాయాన్ని రుణేతర ఆదాయంగా వివరించింది.

2019–2020లో వచ్చిన పన్నుల ఆదాయం 45.5తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గిందని, కేవలం 42.1 శాతమే వచ్చిందని పేర్కొంది. పన్నేతర ఆదాయంలో భారీగా కోత పడినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 74.3 శాతంగా ఉన్న పన్నేతర ఆదాయం.. ఇప్పుడు 32.3 శాతమే నమోదైందని చెప్పింది. వివిధ రాష్ట్రాలకు పన్నుల వాటాల రూపంలో నవంబర్ నాటికి రూ.3.34 లక్షల కోట్లు అందించామని కేంద్రం వెల్లడించింది.

ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ అంచనాల్లో రూ.19 లక్షల 6 వేల 358 కోట్లు (63 శాతం) వ్యయం చేసినట్టు తెలిపింది. రూ.16 లక్షల 65 వేల 200 కోట్లను రెవెన్యూ వ్యయంగా పేర్కొన్న ప్రభుత్వం.. మిగతా రూ.2 లక్షల 41 వేల 158 కోట్లను మూలధన వ్యయమని చెప్పింది. మొత్తం వ్యయంలో రూ.3.83 లక్షలను వడ్డీ చెల్లింపులు, రూ.2 లక్షల 2 వేల 119 కోట్లను సబ్సిడీల కింద వ్యయం చేసినట్టు తెలిపింది.


More Telugu News