గుజరాత్ లో ప్రత్యక్షమైన ఏకశిల విగ్రహం.. తామే ఏర్పాటు చేశామన్న అధికారులు!

  • అహ్మదాబాద్‌ తాళ్‌తేజ్ ప్రాంతంలో ప్రత్యక్షం
  • రాత్రికి రాత్రే ఏర్పాటు
  • సింఫనీ పార్క్‌లో  ఏడు అడుగుల పొడవున్న విగ్రహం  
  • సెల్ఫీలు తీసుకోవచ్చన్న అధికారులు
ప్రపంచంలోని పలు దేశాల్లో వరుసగా ప్రత్యక్షమవుతూ ఆ తర్వాత కొన్ని రోజులకే మాయమైపోతోన్న వింత ఏకశిల విగ్రహం లాంటిది ఒకటి తాజాగా గుజరాత్‌లో కనపడడం అక్కడి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, దానిని తామే కృత్రిమంగా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

ఎక్కడెక్కడో ప్రత్యక్షమవుతూ మాయమైపోతోన్న వింత ఏకశిల విగ్రహం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అటువంటి కృత్రిమ విగ్రహాన్నే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆలోచన రావడంతో ఇలా ఏర్పాటు చేశారు.

అహ్మదాబాద్‌ తాళ్‌తేజ్ ప్రాంతంలోని సింఫనీ పార్క్‌లో ఏడడుగుల పొడవుతో, లోహంతో కూడిన ఈ ఏకశిల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం భూమిలో పాతిపెట్టినట్టు ఉన్నప్పటికీ మట్టిని తవ్విన ఆనవాళ్లు మాత్రం కనపడట్లేదు. మొదట దాని తోటమాలి ఆశారామ్‌ కూడా ఆ ఏకశిల ఎక్కడికి నుంచి వచ్చిందో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార‌్హం.  

సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో చూసినపుడు లేదని, ఉదయం వచ్చి చూసేసరికి ప్రత్యక్షమైందని తెలిపాడు. దీంతో మాయమవుతూ పరిశోధకులను పరుగులు పెట్టిస్తున్న అదే ఏకశిల ఇపుడు భారత్‌లోనూ కనిపించిందంటూ స్థానికులు చర్చించుకున్నారు.

మునిసిపల్ కార్పొరేషన్ హార్టికల్చర్ విభాగం డైరెక్టర్ జిగ్నేశ్ పటేల్ వివరణ ఇవ్వడంతో అది ఎలా వచ్చిందో తెలిసిది. ఈ ఏకశిలను పార్కును సందర్శించే వ్యక్తుల కోసం సింఫనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిందని, దీనిలో మెరిసే ఉపరితలం ప్రతిబింబాన్ని చూడవచ్చని తెలిపారు. దానితో సెల్ఫీలు కూడా తీసుకోవచ్చని చెప్పారు.


More Telugu News