ప్రియురాలిని రహస్యంగా కలిసేందుకు... తన ఇంటి నుంచి సొరంగాన్నే తవ్విన యువకుడు!

  • మెక్సికోలోని తిజువా పట్టణంలో ఘటన
  • ప్రియురాలి భర్త లేనప్పుడు సొరంగం ద్వారా ఆమె వద్దకు.. 
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
తన ప్రియురాలిని రహస్యంగా కలిసేందుకు ఓ యువకుడు తన ఇంటి నుంచి, ఆమె ఇంటి లోపలికి ఏకంగా ఓ సొరంగాన్ని తవ్విన ఘటన మెక్సికోలోని తిజువా పట్టణంలో జరిగింది. ఈ సీక్రెట్ టన్నెల్ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, విల్లాస్ డెల్ ఫ్రాడో - 1లో తన ఇంటి పక్కన ఉన్న పమిల్లా అనే యువతితో అల్బెర్టో అనే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న పెళ్లయిన యువకుడికి వివాహేతర బంధం ఉంది.

ఆమెను రహస్యంగా కలిసేందుకు తన ఇంట్లో నుంచి భారీ సొరంగాన్ని తవ్వాడు. పమిలా భర్త జార్జ్ విధుల్లోకి వెళ్లగానే, ఈ సొరంగం ద్వారా ఆమె వద్దకు వచ్చేవాడు. ఒకరోజు జార్జ్ త్వరగా విధులు ముగించుకుని ఇంటికి రాగా, తన భార్య, ఆమె ప్రియుని బాగోతం బయటపడింది. తనకు వచ్చిన అనుమానంతో ఇల్లంతా వెతికి చూడగా, సోఫా వెనుక దాగున్న ఆల్బెర్టో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

ఆపై తన ఇంటి నేలపై మొదలై, ఆల్బెర్ట్ ఇంటి వరకూ ఉన్న సొరంగాన్ని చూసి కంగుతిన్నాడు. అదే మార్గంలో తన వెంట వచ్చిన జార్జ్ ను తమ ఎఫైర్ ను గురించి తన భార్యకు చెప్పవద్దని ఆల్బెర్ట్ వేడుకున్నాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం చెలరేగడంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. కేసును రిజిస్టర్ చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


More Telugu News