డిసెంబర్ తొలినాళ్లలో మా సర్వర్లు హ్యాక్ అయ్యాయి: ఇండిగో

  • అంతర్గత డాక్యుమెంట్లు పబ్లిక్ వెబ్ సైట్లలో
  • వెంటనే స్పందించామన్న ఇండిగో
  • దీని ప్రభావం స్వల్పమేనని వివరణ 
గత సంవత్సరం డిసెంబర్ తొలి నాళ్లలో తమ సర్వర్లను కొందరు సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. తమ సర్వర్లలోకి ప్రవేశించిన హ్యాకర్లు, కొన్ని అంతర్గత డాక్యుమెంట్లను పబ్లిక్ వెబ్ సైట్లలో ఉంచారని ఓ ప్రకటనలో తెలిపింది.

"మేము ఓ విషయాన్ని చెప్పదలిచాము. గత నెల ప్రారంభంలో ఇండిగోకు చెందిన కొన్ని సర్వర్లు హ్యాక్ అయ్యాయి" అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీని ప్రభావం చాలా స్వల్పమేనని, హ్యాక్ కు గురైన సర్వర్లను వెంటనే తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నామని అన్నారు.

డేటా సర్వర్లలోని కొన్ని సెగ్మెంట్లలో ఈ హ్యాకింగ్ వెలుగులోకి వచ్చిందని, దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి, వెంటనే రక్షణాత్మక చర్యలను తీసుకున్నామని సంస్థ ప్రకటించింది. ఇందుకు సైబర్ నిపుణులు సహకరించారని, జరిగిన హ్యాకింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కూడా చేశామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయమై సైబర్ పోలీసులు విచారణ ప్రారంభించారని పేర్కొంది.


More Telugu News