న్యూ ఇయర్ వేళ తెలంగాణ సడలింపులు... మందుబాబుల తాటతీసిన పోలీసులు!

  • రాత్రి 12 గంటల వరకూ సాగిన మద్యం అమ్మకాలు
  • మందు కొట్టి డ్రైవ్ చేస్తూ పట్టుబడిన దాదాపు 4 వేల మంది
  • కోర్టులో హాజరు పరుస్తామన్న అధికారులు
కొత్త సంవత్సరానికి ప్రజలంతా స్వాగతం పలుకుతున్న వేళ, యువతీ యువకుల ఉత్సాహం మిన్నంటేలా పలు రకాల సడలింపులను తెలంగాణ సర్కారు ఇవ్వగా, పోలీసులు మాత్రం మందేసి చిందేయాలని చూసిన వారి తాట తీశారు. తెలంగాణలో రాత్రి 12 గంటల వరకూ మద్యం అమ్మకాలను అనుమతించగా, అమ్మకాలు జోరుగా సాగాయి. క్లబ్ లు, బార్లు, పబ్బులకు రాత్రి ఒంటిగంట వరకూ అనుమతి ఇవ్వగా, యువతీ, యువకుల్లో జోష్ నిండింది.

అయితే, రాత్రి 10.30 గంటల నుంచే పోలీసులు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర పట్టణాల్లోని వివిధ ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ప్రారంభించారు. తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఈ తనిఖీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో సుమారు 4 వేల మందికి పైగా మందుబాబులు పట్టుబడినట్టు సమాచారం.

అయితే, ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేళ మద్యం తాగి పట్టుబడే వారి సంఖ్యతో పోలిస్తే, ఇది కాస్తంత తక్కువే. న్యూ ఇయర్ వేడుకలను కరోనా నిబంధనలను పాటిస్తూ, ఉత్సాహంగా చేసుకోవచ్చని, ఇదే సమయంలో మద్యం తాగి మాత్రం వాహనాలను నడిపి చిక్కులను కొని తెచ్చుకోవద్దని పోలీసు శాఖ ఎంతగా ప్రచారం చేసినా వందల మంది పట్టుబడటం గమనార్హం. ఇక వీరందరి వాహనాలనూ స్వాధీనం చేసుకున్న పోలీసులు, పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరుస్తామని స్పష్టం చేశారు.


More Telugu News