ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీయే బెటర్: ఈటల రాజేందర్

  • కేంద్రం ఒత్తిడి వల్లే ఆయుష్మాన్ భారత్ లో చేరాం
  • విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తాం
  • కరోనా వ్యాక్సిన్ పై కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం లేదు
కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ప్రభుత్వం చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీయే బెటర్ అని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 80 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ తో కేవలం 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయబోతున్నామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ విధివిధాలను త్వరలోనే  ఖరారు చేస్తామని తెలిపారు. బీజేపీ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని... కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెప్పించాలని అన్నారు.  

మెడికల్ సీట్లలో ఎవరికీ అన్యాయం జరగబోదని ఈటల అన్నారు. తెలంగాణను పోరాడి సాధించుకున్నామని... రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగబోదని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పై తమకు కేంద్రం నుంచి ఇంత వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని... ఎలాంటి ఆదేశాలు కూడా రాలేదని చెప్పారు. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా, పంపిణీ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.


More Telugu News