దినసరి వేతన, కన్సాలిడేటెడ్, ఫుల్ టైం, పార్ట్ టైం సిబ్బంది సర్వీసు క్రమబద్ధీకరించండి: సీఎంకు లేఖ రాసిన సోము వీర్రాజు

  • పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారన్న సోము
  • హామీని నిలుపుకోవాలని విజ్ఞప్తి
  • సర్వీసులు పూర్తికాని వారికి ప్రయోజనం దక్కడంలేదని వెల్లడి
  • 6 వేల మందికి లబ్ది చేకూర్చాలని వినతి
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంతోకాలంగా పనిచేస్తున్న దినసరి వేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైం, పార్ట్ టైం సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలంటూ ఏపీ సీఎం జగన్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో సీఎం జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

ఇప్పటివరరకు దినసరివేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైం, పార్ట్ టైం సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణ కోసం కమిటీలను నియమించలేదని వెల్లడించారు. వీరికంటే 15 ఏళ్ల తర్వాత నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది సర్వీసులు క్రమబద్ధీకరించేందుకు కేబినెట్ కమిటీ, సిఫారసుల కోసం వర్కింగ్ కమిటీ ఏర్పాటయ్యాయని సోము వీర్రాజు తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందితో పోల్చితే దినసరి వేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైం, పార్ట్ టైం సిబ్బందికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని అజేయ కల్లంకు తెలియచేస్తే ఆయన వీరి సర్వీసుల క్రమబద్ధీకరణ అంశాన్ని కూడా కాంట్రాక్టు సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణకు వేసిన కమిటీలో చేర్చారని సోము వీర్రాజు వివరించారు. అయితే ఆయా కమిటీలు కేవలం కాంట్రాక్టు సిబ్బంది కోసమే పనిచేస్తుండడంతో దినసరి వేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైం, పార్ట్ టైం సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీలు దినసరి వేతన, కన్సాలిడేటెడ్ పే, ఫుల్ టైం, పార్ట్ టైం సిబ్బంది సర్వీసులు క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి సిఫారసులు చేయాలని ఆకాంక్షించారు.

ఈ అంశంలో గతంలో జీవోలు వచ్చినా, అందరికీ న్యాయం జరగలేదని పేర్కొన్నారు. 5 ఏళ్లు, 10 ఏళ్లు పూర్తయిన సిబ్బంది సర్వీసులు క్రమబద్ధీకరించినా, ఈ సర్వీసులు పూర్తికాని వారికి ఎలాంటి లబ్ది చేకూరలేదని వివరించారు. ఇలాంటివాళ్లు 6 వేల మంది వరకు ఉన్నారని, వారి సమస్యను సీఎం పరిష్కరించాలని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.


More Telugu News