ఖైదీ నంబరు 6093 అని గూగుల్‌లో సెర్చ్ చేసి ఆశ్చర్యపోయా: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్

  • జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ, మరో 18 కేసులు నమోదైనట్టు తెలిసి ఆశ్చర్యపోయా 
  • ప్రభుత్వ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తారని చెప్పేందుకు ఇది ఉదాహరణ
  • న్యాయవ్యవస్థ హుందాతనం దెబ్బతినడానికి మేమూ కొంత కారణమే
  • పదవీ విరమణ తర్వాత ఏడాది పాటైనా అలాంటి పదవులకు దూరంగా ఉండాలి
ఓ కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ తనకు ఎదురైన మరో అనుభవం గురించి వెల్లడించారు. నిజానికి న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు సీజేకి జగన్ లేఖ రాసిన తర్వాతే ఆయన గురించి తనకు తెలిసిందన్నారు. ఆ లేఖ తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలని అనుకున్నానని తెలిపారు. ‘ఖైదీ నంబరు 6093’ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే బోల్డంత సమాచారం వస్తుందని ఎవరో చెబితే అలానే చేశానని, గూగుల్‌లో ప్రత్యక్షమైన సమాచారం చూసి దిగ్భ్రాంతి చెందానని చెప్పారు.

ఆ మొత్తం సమాచారాన్ని డౌన్‌లోడ్ చేశానని, దానిని ఇక్కడ (తీర్పులో) పొందుపరుస్తున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత కొంత సాధికారిక సమాచారాన్ని కూడా తెప్పించుకున్నట్టు తెలిపారు. జగన్‌పై 11 సీబీఐ కేసులు, ఆరు ఈడీ కేసులు, ఐపీసీ సెక్షన్ కింద మరో 18 కేసులు నమోదై ఉన్నట్టు తెలిసి ఆశ్చర్యపోయానన్నారు.

ఈ కేసులన్నీ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయని, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒకరోజు వాటిలో కొన్ని తప్పుడు కేసులని, వాస్తవాల నమోదులో పొరపాటు జరిగిందని, చర్యలు నిలిపివేశామన్న కారణాలతో పోలీసులు వాటిని మూసివేశారని అన్నారు. డీజీపీ సారథ్యంలోని పోలీసులు ప్రభుత్వ కనుసన్నల్లో ఎలా పనిచేస్తున్నారో చెప్పేందుకు ఇంతకు మించిన నిదర్శనం మరోటి లేదని జస్టిస్ రాకేశ్ కుమార్ పేర్కొన్నారు.

తన పదవీకాలం చివరి రోజుల్లో ఏపీ ప్రభుత్వం తన నిష్పాక్షికతను ప్రశ్నించిందని, అందుకనే ఈ వివరణ ఇస్తున్నట్టు చెప్పిన జస్టిస్ రాకేశ్ కుమార్.. న్యాయవ్యవస్థ హుందాతనాన్ని పరిరక్షించడమే తన లక్ష్యమన్నారు. న్యాయవ్యవస్థ నిజాయతీగా, పక్షపాతరహితంగా ఉండాలన్న భావనకు కొంత విఘాతం కలగడానికి తాము కూడా కొంత కారణమేనన్నారు. న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన తర్వాత చాలా సందర్భాల్లో వారికి వేరే పోస్టు లభిస్తుందని, కనీసం ఏడాది పాటైనా అలాంటి పదవులకు దూరంగా ఉండాలని సూచించారు. అలా చేస్తే ఎవరూ తమను ప్రలోభాలకు గురిచేయలేరని అన్నారు.

తాను ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో జరిగిన ఘటనను ఒకదానిని జస్టిస్ రాకేశ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. తాను బంగ్లా నుంచి హైకోర్టుకు వెళుతుంటే దారి మధ్యలో కొందరు ప్రజలు ప్లకార్డులు పట్టుకుని చేతులు జోడించి రోడ్డు పక్కన నిలబడేవారని, వారు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నట్టు తెలిసిందని అన్నారు. ఆ తర్వాత తనకు అలాంటి ప్రదర్శనలు కనిపించలేదని, కానీ మూడు రాజధానులకు వ్యతిరేకంగా దాఖలైన కేసులపై హైకోర్టు ఫుల్ బెంచ్ విచారణ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో మాత్రం మరో రకమైన ప్రదర్శనలు కనిపించాయన్నారు.

హైకోర్టుకు వెళ్లే దారిలో మందడం వద్ద టెంట్ వేసి కొందరు కూర్చునేవారని, హైకోర్టు న్యాయమూర్తులకు దిష్టిబొమ్మలు, నల్లజెండాలు చూపించేవారని అన్నారు. వారంతా మూడు రాజధానులకు అనుకూలురని ఆ తర్వాత తెలిసిందన్నారు. అక్కడ అధికార పార్టీ నాయకుల పోస్టర్లు, బ్యానర్లు ఉండేవన్నారు. నెల రోజులపాటు ఆ కార్యక్రమం కొనసాగిందని, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తిని అగౌరవపరిచే స్థాయికి చేరిందని జస్టిస్ రాకేశ్ కుమార్ తెలిపారు.


More Telugu News