రూ.80 వేల కోట్లు.. అలీబాబా యజమాని జాక్​ మా సంపద ఆవిరి!

  • రెండు నెలల్లో భారీగా నష్టం
  • ఆయన కంపెనీలపై చైనా ప్రభుత్వం నిఘా
  • రుణ సంస్థల కొనుగోళ్లపై ఆంక్షలు
  • కంపెనీ షేర్లపై వెనకడుగు వేస్తున్న ఇన్వెస్టర్లు
ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.80 వేల కోట్లు.. చైనా ఇంటర్నెట్, ఈకామర్స్ దిగ్గజం అలీబాబా యజమాని జాక్ మాకు రెండు నెలల్లో కలిగిన నష్టం ఇది. అక్టోబర్ చివరి వారం నుంచి ఇప్పటిదాకా ఆయన సంపద ఆవిరైపోయింది.
 
ఆయన కంపెనీలపై చైనా ప్రభుత్వం నిఘా వేయడం, ఆయన కంపెనీల వ్యాపార వ్యవహారాలకు సంబంధించి విచారణ చేస్తుండడం వంటి కారణాలతో ఈ రెండు నెలల్లోనే 1,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.80,641 కోట్లు) మేర 'జాక్ మా'కు నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు జాక్ మా కంపెనీ షేర్లను అట్టిపెట్టుకోవడంపై ఆలోచిస్తున్నారు. షేర్లు తీసుకోవడంపై వెనకడుగు వేస్తున్నారు. చాలా మంది వాటిని అమ్మేశారు.

జాక్ మా అనే కాకుండా టెక్ దిగ్గజాలందరిపైనా చైనా కన్నేసిందని చైనా రెనైసెన్స్ సెక్యూరిటీస్ హాంకాంగ్ కు చెందిన స్థూల, వ్యూహ పరిశోధన విభాగం అధిపతి బ్రూస్ ప్యాంగ్ చెప్పారు. 'పోనీ మా'కు చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ కూ భారీ నష్టమే వచ్చిందన్నారు. నవంబర్ నుంచి కంపెనీ 15 శాతం మేర నష్టపోయిందన్నారు. వాంగ్ షింగ్ కు చెందిన ఫుడ్ డెలివరీ సంస్థ మైతువాన్ కు 20 శాతం నష్టాలు వాటిల్లాయని, అలీబాబా అమెరికా విభాగానికి 25 శాతానికి పైగానే నష్టాలు వచ్చాయని చెప్పారు.

చెల్లింపు వ్యవహారాల సంస్థ అయిన యాంట్ గ్రూప్ కోను టేకోవర్ చేయాలనుకోవడమే జాక్ కొంపముంచిందని నిపుణులు చెబుతున్నారు. కానీ, చైనా నియంత్రణ సంస్థలు ఆ ఒప్పందాన్ని అడ్డుకున్నాయి. ఆ కారణంగా యాంట్ ఐపీవోకు వెళ్లలేకపోయింది. దాంతో పాటు రుణ రంగంపై ఇంటర్నెట్ దిగ్గజాలు పెత్తనం చెలాయించకుండా ఉండేందుకు ఆ దేశ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు కూడా విధించింది. ఎప్పుడో కొనుగోలు చేసిన కంపెనీలను సాకుగా చూపి అలీబాబా, టెన్సెంట్ లకు జరిమానాలూ విధించింది. దీంతో వాటి వృద్ధికి కొద్దికొద్దిగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి.


More Telugu News