ఆక్స్ ఫర్డ్ టీకాకు ఇప్పుడే అనుమతి ఇవ్వలేము: యూరోపియన్ యూనియన్

  • టీకా ట్రయల్స్ సమాచారం అందలేదు
  • పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చేందుకు మరో నెల సమయం
  • ఈఎంఏ డిప్యూటీ ఈడీ నోయల్ వాటియన్
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు తక్షణం అనుమతించే అవకాశాలు లేవని యూరోపియన్ యూనియన్ అధీనంలోని ఔషధ నియంత్రణ సంస్థ ఈఎంఏ (యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ) తేల్చి చెప్పింది.

ఈ వ్యాక్సిన్ పై ఇంకా పూర్తి సమాచారం తమకు చేరలేదని స్పష్టం చేసిన ఈఎంఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నోయల్ వాటియన్, ఇప్పటివరకూ ఆ సంస్థ తమ వ్యాక్సిన్ కు అనుమతించాలని దరఖాస్తు కూడా చేసుకోలేదని అన్నారు. బెల్జియం వార్తా పత్రిక 'హెట్ న్యూస్ బ్లాడ్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఆస్ట్రాజెనికా టీకాకు, నిబంధనలతో కూడిన మార్కెటింగ్ లైసెన్స్ ఇవ్వడానికి అవసరమైన గణాంకాలు కూడా అందలేదని ఆయన అన్నారు.

వ్యాక్సిన్ పై మరింత సమాచారం అందాల్సి వుందని, ఆ తరువాతే తాము ఓ నిర్ణయానికి రాగలమని వెల్లడించిన నోయల్ వాటియన్, ఇందుకు కనీసం మరో నెల రోజుల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. కాగా, గతవారం ఆస్ట్రాజెనికా చీఫ్ పాస్కల్ మాట్లాడుతూ, తమ వ్యాక్సిన్ కరోనా నుంచి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కొత్త వైరస్ స్ట్రెయిన్ నుంచి కూడా ఇది రక్షిస్తుందని ఆయన అన్నారు.

ఇదిలావుండగా, బ్రిటీష్ ఔషధ నియంత్రణ సంస్థలకు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ కు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికే చేరింది. దీని వాడకానికి త్వరలోనే అనుమతులు లభించవచ్చని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నోయల్ వాటియన్, బ్రిటన్ అధికారులకు చేరిన వ్యాక్సిన్ సమాచారం కూడా తమ వద్ద లేదని అన్నారు. బ్రిటన్ ప్రభుత్వం టీకాను అనుమతిస్తే, మిగతా ఈయూ దేశాల్లో కొన్ని పరిమితులతో కొంతమందికి వ్యాక్సిన్ ను పంచేందుకు అనుమతించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏదిఏమైనా అత్యుత్తమ క్వాలిటీ ఉన్న టీకాను ప్రజలకు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈయూ దేశాలకు 30 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తొలిదశలో, ఆపై మరో 10 కోట్ల డోస్ లను రెండో దశలో ఇచ్చేందుకు గత ఆగస్టులోనే ఆస్ట్రాజెనికా ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.


More Telugu News