రాజకీయ విద్వేషానికి కేంద్రంగా యూపీ..: యోగి ఆదిత్యనాథ్ కు 104 మంది మాజీ ఐఏఎస్ ల లేఖ!

  • తీవ్ర వివాదాస్పదం అయిన మతమార్పిడి వ్యతిరేక ఆర్డినెన్స్
  • లేఖపై పలువురు సీనియర్ల సంతకాలు
  • శివశంకర్ మీనన్, నిరుపమ రావు, టీకేఏ నాయర్ తదితరుల సంతకాలు
యూపీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక ఆర్డినెన్స్ వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ కు ఓ లేఖను రాస్తూ, రాష్ట్రం విద్వేషపూరిత రాజకీయాలకు, మతదురభిమానానికి కేంద్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖపై మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమ రావు, ప్రధాని మాజీ సలహాదారు టీకేఏ నాయర్ తదితరులు సంతకాలు చేయడం గమనార్హం.

ఈ ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. "రాజ్యాంగాన్ని కాపాడుతామని మీరు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. రాజ్యాంగం గురించి మరోసారి తెలుసుకోండి. ఒకప్పుడు గంగా - యమునా నాగరికతకు మేళవింపుగా విలసిల్లిన యూపీ, ఇప్పుడు విభజనవాదానికి, విద్వేష రాజకీయాలకు కేంద్రమైంది. ప్రభుత్వ సంస్థలు మతమనే విషాన్ని నింపుతున్నాయి" అని తమ లేఖలో ఆరోపించారు.

"మీ పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అత్యంత క్రూరమైన నేరాలు జరుగుతున్నాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనం సాగించాలన్న ప్రజల కోరికకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి" అని అన్నారు. ఇటీవలి కాలంలో మైనారిటీలపై జరిగిన దాడులను కూడా మాజీ ఐఏఎస్ లు ప్రస్తావించారు. అమాయక ప్రజలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను అరికట్టడంలో పోలీసులు సైతం మిన్నకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఐఏఎస్ లు రాసిన ఈ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


More Telugu News