ఎమ్మెల్యేలను కొనగలరేమో కానీ తృణమూల్ ను కాదు: మమతా బెనర్జీ

  • బోల్పూర్ సభలో మమతా వ్యాఖ్యలు
  • హింసావాద, విభజన రాజకీయాలు ఆపాలని బీజేపీకి హితవు
  • మతతత్వ శక్తులంటూ బీజేపీపై ధ్వజం
  • సోనార్ బంగ్లాను కాపాడుకోవాలని పిలుపు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ అధినాయకత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని ఎన్నటికీ కొనలేరని ఆమె స్పష్టం చేశారు. మీరు కొందరు ఎమ్మెల్యేలను కొనగలరేమో... కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎన్నటికీ కొనలేరు అని వ్యాఖ్యానించారు. బోల్పూర్ లో జరిగిన బహిరంగ సభలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. హింసావాద, విభజన రాజకీయాలు ఆపాలని హితవు పలికారు.

బెంగాల్ ను 'సోనార్ బంగ్లా' (స్వర్ణ బెంగాల్) గా మార్చుతామంటూ కొందరు రాష్ట్రానికి వస్తున్నారని, కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్ ను ఎప్పుడో 'సోనార్ బంగ్లా'గా మార్చారని, ఇప్పుడు చేయాల్సింది మతతత్వ శక్తుల నుంచి ఆ 'సోనార్ బంగ్లా'ను కాపాడుకోవడమేనని స్పష్టం చేశారు. హిందూత్వం పేరుతో రాజకీయాలను ఎగదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు.

విశ్వభారతి విశ్వవిద్యాలయ సంస్కృతిని బీజేపీ నాశనం చేస్తోందని, విశ్వభారతి చుట్టూ ఇలాంటి రాజకీయాలు నడుస్తోండడం తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ బీజేపీకి చెందిన వ్యక్తేనని, ఉన్నతస్థానంలో ఉన్న ఆ వ్యక్తి మతవిద్వేష రాజకీయాలకు సహకరిస్తూ విశ్వవిద్యాలయ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News