రైతులకు ఈ రోజు మూడో విడత నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్

  • రైతు భరోసా కింద రూ.1,120 కోట్లు విడుదల
  • తుపానుతో దెబ్బతిన్న రైతులకు రూ.646 కోట్ల పెట్టుబడి రాయితీ
  • రైతుల ఖాతాల్లోకి ఆర్థిక సాయం జమ
  • రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న సీఎం
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో విడత నిధులను ఏపీ సీఎం జగన్ ఇవాళ విడుదల చేశారు. అంతేకాదు, నివర్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కూడా జమ చేశారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతులకు రూ.1,120 కోట్లు, నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ రూపంలో రూ.646 కోట్లు ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రైతుల ఖాతాల్లోకి జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.13,500 ఇస్తున్నామని, వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.13,101 కోట్లు అందించామని వెల్లడించారు. కౌలు రైతులతో పాటు అటవీభూముల్లో సాగు చేస్తున్న రైతులకు కూడా తాము సాయం చేశామని తెలిపారు.

గత ప్రభుత్వం నాటి రూ.904 కోట్ల సున్నా వడ్డీ బకాయిలను కూడా తామే చెల్లించామని, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ ఖరీఫ్ సీజన్ లో రూ.510 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ వివరించారు. గత సర్కారు రూ.87,612 కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిందని విమర్శించారు.


More Telugu News