అంతుచిక్కని వ్యాధితో హడలిపోతున్న తెలంగాణలోని ఓ గ్రామం!

  • ముప్పనపల్లిలో భయానక వాతావరణం
  • మూడు వారాల్లో ఆరుగురి మృతి
  • కడుపునొప్పి, రక్తపు వాంతులతో బాధపడుతున్న ప్రజలు
  • వైద్యాధికారులకు కూడా అంతుబట్టని వ్యాధి
  • గ్రామం నుంచి వెళ్లిపోతున్న కుటుంబాలు
ఇటీవల ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి అంటూ ఎంత కలకలం రేగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితులే ఇప్పుడు తెలంగాణలోని ములుగు నియోజకవర్గంలో ప్రజలను హడలెత్తిస్తున్నాయి. కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో గత మూడు వారాలుగా కడుపునొప్పి, రక్తపు వాంతులతో పరిస్థితి భీతావహంగా మారింది. ఇలాంటి లక్షణాలతో ఆరుగురు మృత్యువాత పడడంతో గ్రామంలో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.

కడుపునొప్పి, జ్వరం అంటే చాలు గ్రామస్తులు వణికిపోతున్నారు. చాలామంది ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. తమ ఊరికి ఎవరో చేతబడి చేయించారని, గ్రామాన్ని శక్తి ఆవహించిందని కొందరు నమ్ముతున్నారు. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముప్పనపల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.

కరోనాతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా అన్నీ నెగెటివ్ అనే వచ్చాయి. మరి ప్రజల మరణాలకు కారణమేంటన్నది వైద్యాధికారులకు కూడా అంతుబట్టడం లేదు. దాంతో గ్రామస్తులు ఇంకా హడలిపోతున్నారు. మొత్తం 60 కుటుంబాలున్న ఈ గ్రామం నుంచి 40 కుటుంబాలు తరలిపోయాయి. 


More Telugu News